Ultimate magazine theme for WordPress.

కవితల ప్రయాణం

Post top
home side top

మీరు పంపించిన పుస్తకం చదివాను మీ కవితల గురించి చెప్పాలంటే మీరు తెలియకుండా ఉండి ఉంటే కవితలు త్వరగా చదివేదాన్ని ఏమో అనుకున్నాను..

 

కవితలు మొదలు పెట్టినప్పుడు ఒకటి రెండు మూడు సాఫీగా వెళ్ళిపోయాయి ‘ఆమె ‘చదివినప్పుడు బాగుంది అనిపించింది…

 

మెల్లిమెల్లిగా కవితలు గాఢతను సంతరించుకుంటూపోయాయి… ‘జీవిత పుస్తకం’ అందులో

పుస్తకంలోని ప్రతి అక్షరం బాపు బొమ్మంత అందంగా రాసుకున్నాను….

అకాల వర్షం కురిసిన రాత్రి నా హృదయపుస్తకం చెదలు పట్టింది…

ఈ రెండు వాక్యాలు కవితను మర్చిపోనివ్వకుండా చేశాయి.. ఆఖరు లైను కలం ఆగిపోయింది అనకుండా.. కదలడం లేదు అనే ముగింపుతో తిరిగి ఊపిరి అందింది..

 

కవితలు మొదలుపెట్టేటప్పుడు సరళంగా మొదలవుతూ మెల్లిమెల్లిగా కాస్తంత వరవడిని అందుకుంటూ ఎక్కడో నిశ్శబ్దమైన ముగింపును కళ్ళ ముందు నిలుపుతుంది…

 

ఊండెడ్ వారియర్… ఈ కవిత గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందులో ఒక పోరాటం ఉంది అనంతమైన బాధ ఉంది అయినా గెలిచిన ఓ రాణి కనిపిస్తుంది…. రియల్లీ ఐ లవ్ ఇట్…

 

కళ్ళు… ఆమె కళ్ళే మాట్లాడుతాయి అంటూ ఎన్నెన్నో మాటలు చెప్పారు. భాష కందని భావాలను పంచుకునే రెండు మనసులు కొత్త పుస్తకాలను రచిస్తున్నాయి అని చెప్పిన వాక్యం చాలా బాగుంది…

 

గుండె తలుపు అన్న కవిత చదివిన ప్రతి ఒక్కరికి తను వదిలేసిన జ్ఞాపకాలో..వదులుకున్న జ్ఞాపకాలో కానీ తడి ఆరని జ్ఞాపకం ఒకటి చెంత చేరడం నిజం..

 

నీ కళ్ళల్లో నా స్వప్నాలను దాచాను అంటూ మిమ్మల్ని మీరు వెతుక్కుంటూ.. మిమ్మల్ని మీరు వెనుతిరిగి చూసుకుంటూ .. తనుగా మీరు ఒక్కొక్క అడుగు వేస్తూ… వెళ్లడం.. మనసును భారం చేసి తడి అద్ది వెళ్ళింది..

 

ఆలోచన ప్రవాహం… నిజంగా ఒక తుఫాను తాకిడి.. చెల్లా చెదిరైన ఓడరేవు… ఎవరు ఎదురు కానీ నిర్ధాక్షపు ఎడారిని ఎదుట నిలుపుతుంది… ఓహ్ చెప్పడానికి మాటలు ఏమీ లేవు…

 

ఎన్నెన్ని జ్ఞాపకాలు కొన్నిచోట్ల ఆమెను వెతుకుతూ.. మీరు మరికొన్ని చోట్ల ఆమె మీ చెంత నిలవడం ..ఇంకొన్ని చోట్ల మీరు తానై నడిచిన గుర్తులు.. మీరు తప్పిపోయిన చోట తను చేయూతనివ్వడం… ఒకటి కాదు రెండు కాదు… ప్రతిచోట ఆమెతో మొదలై….. ఆమెతో సాగుతూనే ఉంది..

 

అప్పుడప్పుడు అక్కడక్కడ అనిపిస్తుంది నాకు కూడా… నా అతను ఆమె ఎలా అయ్యాడని… ప్రేమించడం అవధులు దాటినప్పుడు అతను.. ఆమె అంటూ తారతమ్యం మిగులుతుందా.. వినీల ఆకాశానికి పేరు ఏం పెడతాం….

 

ఒంటరితనం భ్రమలో ఉంది నన్ను జయించానని…… నువ్వు తలుచుకున్న ప్రతిసారి నాకు పొలమారిందని ఒంటరికేమి తెలుసు జంటలో మాధుర్యం…. ఇక్కడ ఆవేదన కన్నా అతి మధురమైన ప్రేమనే నాకు చాలా కనిపించింది….

నీ జ్ఞాపకాలు హృదయ ద్వారా ముందు వేలాడుతున్నాయి…. ఈ వాక్యం ఎంత అపురూపంగా ఉందో.. ఒక్కసారి వచ్చిపోవు ..మన ఇంటికి వెలుగులు తెచ్చిపోవు అంటూ ముగించడం.. మనసుకు ఓ చిక్కటి చీకటిని పరిచయం చేసింది..

 

నువ్వు వస్తావు కదూ మేఘాలతో చెప్పి ఆకాశాన్ని కప్పుకోమని చెప్తా …పౌర్ణమి చంద్రుడికి చెప్పి నీకోసం నక్షత్రాల పల్లకి పంపమని చెప్తా నువ్వు వస్తావు కదూ నన్ను పలకరించి పోతావు కదూ… ఈ అక్షరాలు మేఘాలు లేకుండానే వర్షాన్ని కురిపించి వెళ్ళింది…

 

నిజమే జ్ఞాపకాలు కుప్పలు కుప్పలుగా ఉంటాయండి చక్కని అపురూపమైన జ్ఞాపకాలు తెచ్చుకుందామని ఎంత వెతికినా అదేమిటో ఇంటికి వచ్చి చూసుకుంటే తీపి జ్ఞాపకాలు కంటే చేదు జ్ఞాపకాలే చాలా మిగిలిపోతాయేమో…. అయినా మీరు మాత్రం తీపి జ్ఞాపకాలను పోగుచేసుకుని బయటికి వచ్చాను అని ముగించడం చాలా నచ్చింది..

 

వియోగంలో ఒంటరితనం విలువ పరిచయం లేని వ్యక్తులను ఒకటి చేసిన వాడికి తెలియదేమో అని ముగించిన కవిత చాలా ఆలోచనలని కుప్పగా పోసిపోతుంది..

 

నా వెంటే అంటూ నువ్వు చూస్తున్నావు నేను నిన్ను వెతుకుతున్నాను నువ్వు విశ్వమంతా వ్యాపించావు..

మీరు జ్ఞాపకాలలో తన బొమ్మ గీయడం చాలా బాగా నేర్చుకున్నారు.. అందుకే అలవోకగా నీ దారి నాలో ముగిసిందని నేను నీ దారిలో పయనించాలని అనే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నారు…

 

కాన్వాస్… ఇది చాలా అపురూపంగా అనిపించింది మీరు ఆమె రూపాన్ని జ్ఞాపకాల్లో బంధించడం మరింత చిక్కగా నేర్చుకున్నారని చెప్పకనే చెప్పింది…

 

చిత్తడి గుండెలో మెల్లమెల్లగా అడుగులు వేస్తూ నీ వెచ్చని పాదాలు నన్ను హత్తుకున్నాయి.. ఎంత చక్కటి ఆహ్వానం…. నీ ఎడబాటు ఊపిరిలో పీకలు లోతు దిగిపోయిన నన్ను బతికించేది నీ ఊపిరి అంటూ అందమైన బహుమతిని అందించారు…

 

అందమైన సెలయేరు ఆ పైన విరిజల్లులు .. తడిసి ముద్దయిన రెండు హృదయాలు.. ప్రపంచానికి దూరంగా ఊహలకి దగ్గరగా అంటూ ముగించిన ఓ కవిత ఓ నిజానికి ఓ కలకి మధ్యన వంతెన కడుతోంది…

 

నిన్న నాతో నువ్వు …నేడు నాలో నువ్వు ఈ రెండు వాక్యాలు చాలు ఆమె మీతో పాటు ఉందని చెప్పడానికి అందుకే అతి సున్నితంగా నా ప్రతి చర్యను నియంత్రించేది నా ఉనికిని నిర్ధారించేది నువ్వేగా అంటూ బలమైన విశ్వాసంతో గాఢంగా చెప్పారు..

 

కళ్ళు కనాల్సిన కలలు కనురెప్పల వాకిట్లో తచ్చాడుతున్నాయి… అవును అవి అక్కడే ఉంటాయని తెలుసు ఆమె ఎక్కడ ఉన్నా మీరు తనని వెతుక్కోగలనని ధీమా…. మీరు అందంగా గీసిన తన అద్భుత వ్యక్తిత్వ చిత్రానికి రంగును వేస్తున్నారనడానికి ఆనవాలు యేమో…

 

అందుకే నన్ను వదిలిపోనంటున్నాయి నీ జ్ఞాపకాలు అంటూనే విశ్వమంతా వ్యాపించి చావు పుట్టుకల గూర్చి బోధించే గురువై నీవు… అర్థం కాని ఆ రహస్యాలను శోధించే శిష్యుడుగా నేను .. అంటూ ఓసారి

నా బతుకు నిచ్చెనకు నీ జ్ఞాపకాలను కట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కనిపించని భవిష్యత్తును వెతుక్కుంటూ అని మరోసారి… తెలియని దూరాలలో ఉండి విశ్వమంతా వ్యాపించిన నీ శ్వాస ..నాకు ప్రాణం పోసింది నాలో చీకట్లను తొలగించింది….అని ఓ సత్యాన్ని దోసిట్లోకి అందుకున్నారు..

 

కళ్ళను అడుగు నీపై ప్రేమ లోతు ఎంతో చెబుతుంది… అంటూ మనసుకు పుస్తకం చెప్పిన ప్రతి అక్షరం .. ఆమె జ్ఞాపకాలకు ప్రాణం పోస్తుంది ..

 

ప్రభాత మబ్బుల్లో నుంచి బయలుదేరిన నీకు సాయం సంధ్య అలసట తీరుతుందా అంటూ మొదలుపెట్టి నీకు ఇష్టమైన వంటలు సిద్ధంగా ఉన్నాయి కాస్త ఎంగిలి పడిపోరాదు అని పిలిచిన ప్రేమను తలుచుకొని తలుచుకొని రాసిన మీ కవితలు చదవడం కష్టంగా కూడా ఉంటుందని ఇప్పుడే తెలిసింది..

 

కలిసి రాని కాలాలు మిగిలిపోతున్న జ్ఞాపకాలు…

నా కంటిపాపవు నువ్వే ..నా కళ్ళతో ప్రపంచాన్ని చూసేది నువ్వే..

ఆకస్మిక పెనుమార్పులు కోలుకోలేని దెబ్బలు జ్ఞాపకాలై బాధిస్తాయి ఒంటరిని చేసి వేధిస్తాయి…

నీకోసం వెతికే నీ సహచరుడిని ఎప్పటికీ నిన్ను తలుచుకునే నీ జ్ఞాపకాన్ని ఎప్పటికీ నేను నీ నమ్మకాన్ని నువ్వు నా సర్వస్వానివి.. (ఇలా ఎన్నెన్నో ఉన్నాయి) అంటూ మెల్లిమెల్లిగా తనని తాను ఉలితో చెక్కుకుంటూ…

అతను ఆమె రూపాన్ని పూర్తిగా తనలో సగ భాగంగా పునర్నిర్మించుకోవడం…. అపురూపమే అంతే కాదు జీవితానికి అందమైన ఆలంబన కూడా..

 

మీ కవితల ప్రయాణం.. అరుదైన అపురూపమైన ప్రయాణమే…

post bottom

Leave A Reply

Your email address will not be published.